పర్వతం ఒకరి ముందు మోకరిల్లదు

Monday, 22nd Oct 2018
పర్వతం ఒకరి ముందు మోకరిల్లదు

సినీ రంగమైనా లేక రాజకీయ రంగమైనా ప్రజలెప్పుడూ ఉన్నత వ్యక్తిత్వంగల వారినే ఆరాధిస్తారు. తమ ఆరాధ్య నాయకుడిలో తమను తాము చూసుకుంటూ మురిసిపోవడమే కాక అవసరమైతే ఒకరిని ఎదిరించగలరు లేదంటే ప్రాణత్యాగమైన చేయగలరు. దీనిని కొంతమంది వెర్రి అంటే మరి కొంతమంది పరిమితులు లేని ఆరాధనా భావమని కొనియాడుతుంటారు. దశాబ్దాల తరబడి ఈ విధంగా ప్రభావితం చేయగల నాయకులు అతికొద్దిమందే ఉండగా వారిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంటారనడం సమంజసమే.

చిన్న మందుసీసా, చేతిలో చిల్లర పెట్టంది ఓట్లు రాలని ఈ కలికాలంలో కేవలం ఒక్క మాటతో అభిమానులను ప్రభావితం చేసి, ధవళేశ్వరం వంతెనపై లక్షలాది మందిని కవాతు చేయించిన ఘనత ఈ కాలంలో పవన్ కళ్యాణ్కు తప్ప ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదేమో. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా తమ సభలకు జనసమీకరణ పేరుతో కొంత డబ్బును కేటాయించడం చూస్తే ఎవరికైనా ఇది వాస్తవమే అనిపించకమానదు. అయితే అతనొక సినీ కథానాయకుడు, అందుకే చూడటానికి జనం వచ్చారని తెలుగుదేశం నాయకులు పదే పదే అనడం వారి ఈర్ష్యను తెలియజేస్తోంది.

గత ఎన్నికలలో టిడిపి, వైసిపి మధ్య నువ్వా నేనా అన్నట్లున్న సమయాన పవన్ చెప్పిన ఒక్క మాట టిడిపిని గెలిపించింది. ఈ విషయాన్ని స్వయానా అధికార పక్షమే చెప్పడం చూస్తే పవన్ కథానాయకుడి స్థాయి నుండి జననాయకుడిగా ఎప్పుడో మారిపోయాడని వేరే చెప్పక్కర్లేదు. మరి అలాంటి వ్యక్తి ఉన్నట్లుండి ఇప్పుడు టిడిపికి ఎందుకు బద్ద శత్రువుగా మారడు అంటే, ఆయనను అభిమానించే వారి నుండి వచ్చే ఒకే ఒక్క సమాధానం నిబద్దత.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అనుభవమైన నాయకుడు కావాలని పవన్ భావించగా, చంద్రబాబు పోయిన ఎన్నికలలో వెల్లడించిన హామీలనే నెరవేర్చకపోవడం ఆయనకు కోపం తెప్పించింది. పైగా ప్రత్యేక హోదా సమయంలో కేంద్రంతో చంద్రబాబు రాజీపడిన యత్నం ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. ఈక్రమంలోనే చంద్రబాబు బాధ్యతారాహిత్యంతో కూడిన పాలన అవినీతి నాయకులకు అండగా ఉందే తప్ప సామాన్యుడికి, ముఖ్యంగా యువతకు చేయూతనిచ్చే విధంగా లేదనేది పవన్ వాదన.

ఇందులో భాగంగానే ప్రజల పక్షాన నిలిచేందుకు ఇటు రాష్ట్రంతోనూ అటు కేంద్రంతోనూ శత్రుత్వం పెంచుకున్నారు పవన్. అతని తొణకని ధైర్యం, బెణకని ఆత్మ విశ్వాసంతో కూడిన వ్యక్తిత్వమే రేపు వచ్చే ఎన్నికలలో సంచలనం సృష్టించే అభిమానులను సంపాదించిపెట్టాయి. లక్ష్యం దూరమైనా, దారి చీకటిగా ఉన్నా గుండె నిండా ధైర్యంతో ఉండే పవన్ వాటిని పట్టించుకోకుండా ప్రజల క్షేమమే ముఖ్యంగా సాగుతున్నారు. ఈ విధంగా మొన్న కవాతులో ఆయన చెప్పినట్లు పర్వతం ఒకరి ముందు మోకరిల్లదు అని నిరూపిస్తున్నారు.