మీడియా చెంప చెళ్లుమనిపించిన పవన్

Wednesday, 24th Oct 2018
మీడియా చెంప చెళ్లుమనిపించిన పవన్

ప్రస్తుతం ప్రసారమాధ్యమాలలో నైతికతకు అర్ధం లేకుండా పోయిందనేది అందరూ అంగీకరించే విషయం. అనవసరమైన విషయాల పట్ల వారు సాగించే చర్చలు, పిల్లల మనస్తత్వంపై ప్రభావం పడుతుందనే విచక్షణ లేకుండా, నగరంలో జరిగిన హత్యలను పదే పదే చూపించే తీరు అర్ధరహితం. కేవలం టి.ఆర్.పి రేటింగులే పరమావధిగా సాగుతున్న ప్రస్తుత మీడియా అందుకోసం ఎంత దూరమైనా వెళుతుందని నిరూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రసార మాధ్యమాలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు, గత కొన్ని నెలలుగా అత్యధిక టి.ఆర్.పి రేటింగులు సాధించడానికి వారికి లభించిన వ్యక్తి పవన్ కళ్యాణ్.

ఇటీవలి కాలంలో మీడియా అనవసరమైన విషయాలకి పవన్ కళ్యాణ్ను వివాదంలోకి లాగుతోందనేది ప్రతి సామాన్య తెలుగువాడికి తెలిసిన విషయమే. అది శ్రీరెడ్డి వివాదం అయినా లేక కత్తిమహేష్ ఉదంతమైనా పవన్ కళ్యాణ్ను ప్రతినాయకుడిగా చూపించే ప్రయత్నం జరిగింది. ఈ వివాదాల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని భావిస్తున్నా, ప్రసార మాధ్యమాల తీరు సగటు ప్రేక్షకుడికి విసుగు తప్పించి మీడియాపై పూర్తి విశ్వాసం కోల్పోయేలా చేసాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఆఖరుకి సామాన్యుల సమస్యలపై తప్పితే సహనం కోల్పోని పవన్ కళ్యాణ్ కూడా అనవసరంగా తన తల్లిని వివాదంలోకి లాగేసరికి ఆగ్రహించి మీడియాపై పరోక్ష యుద్దానికి దిగారు. ఈ క్రమంలోనే తన అభిమానులకు మరియు మద్దతుదారులకు ఆయా మీడియా సంస్థలను బహిష్కరించవలసిందిగా కోరడంతో ఆ యొక్క ఛానెళ్ల టి.ఆర్.పి రేటింగులు అమాంతం పడిపోయాయి. ఈ ఉదంతం పవన్ అభిమాన గణానికి ఉన్న బలమెంతో తెలుపడమే కాకుండా ప్రజలు సదరు మీడియా సంస్థలపై ఎంత విసుగు చెంది ఉన్నారో తెలుపుతోంది.

ఇదే సందర్భంలో ఎవరూ ఊహించలేని కార్యక్రమాన్ని రూపొందిస్తానని సదరు మీడియాపై పవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సవాల్ విసరడం అందరిలో ఆసక్తిని కలిగించింది. ప్రస్తుతం శ్రీకాకుళాన్ని కబళించిన టిట్లి తుఫాను ఆయనలోని మానవత్వాన్ని వెలికితీసి పరోక్షంగా అప్పటి సవాలుకు సమాధానంగా నిలిచిందని చెప్పాలి. ఇది యాధృచ్చికమే అయినా, పవన్ అనుకుని చేసినది కాకపోయినా ప్రజలకి కష్టం వచ్చిన సమయంలో ఒక మీడియా ప్రతినిధి ఏవిధంగా ఉండాలో ఆయన స్వయంగా చూపించిన తీరు మెచ్చుకోదగ్గ విషయం.

టిట్లి తుఫాను శ్రీకాకుళం జిల్లా వైభవాన్ని తుడిచిపెట్టి వేయగా ఆంధ్ర ప్రభుత్వం అంతా బానే ఉందని చేతులు దులుపుకున్న తరుణంలో పవన్ అక్కడ పర్యటించారు. అయితే ప్రభుత్వం చెప్పిన దానికి భిన్నంగా అక్కడి పరిస్థితులు ఉండగా పవన్ స్వయంగా తన మొబైల్ ఫోన్ ద్వారా సామాన్యుల ఇక్కట్లను చిత్రీకరించి ప్రపంచానికి తెలియజేసారు. ఒక విధంగా ఆయనే ఆ ప్రాంతానికి విలేఖరి అయ్యారని చెప్పాలి. ఇది పవన్ కావాలని చేసినది కాకపోయినా, లాలూచి పడే ప్రభుత్వాధికారులకు అండగా నిలిచే సదరు మీడియా వారికి ఇది నిస్సందేహంగా ఒక చెంప పెట్టు లాంటి సమాధానమే.