తెలంగాణలో బహుజన పార్టీకి పవన్ మద్దతు ?

Thursday, 25th Oct 2018
తెలంగాణలో బహుజన పార్టీకి పవన్ మద్దతు ?

పవన్ కళ్యాణ్ ఉన్నఫళంగా లక్నో వెళ్లడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది, ఈ నేపథ్యంలోనే ఒక వార్త రాజకీయ వర్గాలలో సంచలనం కలిగిస్తోంది. అదేమంటే త్వరలోనే తెలంగాణాలో జరుగబోయే ఎన్నికలలో బహుజన పార్టీకి పవన్ మద్దతు తెలుపనున్నారని. గత ఎన్నికలలో ఎక్కువ శాతం ప్రజల మద్దతు లభించిన మూడవ అతిపెద్ద పార్టీగా బహుజన పార్టీకి పేరు ఉంది. ఇప్పటికే తెలంగాణాలో జరుగబోయే ఎన్నికలకు మాయావతి 119 స్థానాలకు తన అభ్యర్థులను నిర్ణయించారు కూడా. పార్లమెంట్ సభ్యుడు వీర్ సింగ్ నేతృత్వాన తెలంగాణాలో బి.ఎస్.పి పోటీ పడనుంది. 2014 ఎన్నికలలో టి.ఆర్.ఎస్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నప్పటికీ రెండు స్థానాలను గెలుచుకుని బి.ఎస్.పి అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పొచ్చు.

ఈ పరిస్థితుల్లో పవన్ మాయావతిని కలవడానికి లక్నో వెళ్లడం రాజకీయ వర్గాలలో అమితాసక్తిని కలిగించింది. కొన్ని నెలల క్రితం తాను తెలంగాణాలో పోటీ చేయకపోయినప్పటికీ ఒక పార్టీకి మద్దతు తెలుపుతానని పవన్ స్పష్టం చేశారు. మరోవైపు వచ్చే ఎన్నికలలో ప్రధాన అభ్యర్ధికి పోటీపడే వారిలో మాయావతి కూడా ఒకరు, ఇప్పటికే ఆమె వివిధ ప్రాంతీయ పార్టీలను కలుపుకునిపోతుండగా జనసేనతో పొత్తు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసివస్తుందని భావించినట్లు సమాచారం.

పవన్ కూడా ఆంధ్ర ప్రజల మద్దతు కూడగడుతూ కులాల ఐక్యత అనే కొత్త నినాదంతో ముందుకు వెళుతున్నారు. గతంలో అన్ని పార్టీలు కూడా ఏదో ఒక కులానికే మొగ్గు చూపి తమ ఓటు బ్యాంకును సంరక్షించుకునే దిశగా అడుగులు వేస్తే, సరికొత్త ఆలోచనతో పవన్ అనగారిన వర్గాలను ఆకర్షించారనే చెప్పాలి. ఇటు బి.ఎస్.పి కూడా ఎస్.సి, ఎస్.టి, ఓ.బి.సి మరియు ఇతర మైనారిటీ మతాలైన ముస్లిం, క్రిస్టియన్, సిఖ్ మరియు బౌద్ధుల సమ్మేళనంతో దేశంలో పలు రాష్ట్రాలలో పాగా వేసే పనిలో ఉంది. ఈ తరుణంలో జనసేనతో తప్ప మరే పార్టీతో పొత్తు బి.ఎస్.పికి లాభసాటిగా ఉండదేమో.

పవన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మరో కారణం ప్రత్యేక హోదా విషయమై నరేంద్ర మోడీ మాటతప్పడమే. ఒకవైపు కాంగ్రెస్ అస్తవ్యస్తంగా రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేస్తే ప్రత్యేక హోదా ఇస్తానని ఆశ చూపి మరీ మోడీ మోసం చేశారు. ఈ విషయమే జననాయకుడికి ఆగ్రహం తెప్పించి, సాంప్రదాయ పార్టీలకు ధీటుగా మాయావతి వంటి మరో ప్రత్యామ్నాయ శక్తిని నిలబెట్టాలని భావించినట్లు తెలుస్తోంది.

మరి ఈ తరుణంలో పవన్ పరిస్థితి తెలంగాణాలో ఏ విధంగా ఉండబోతోంది ? గతంలో ఆయన తెలంగాణాలో కె.సి.ఆర్ పరిపాలన బాగుందని పలుమార్లు కితాబిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరిప్పుడు ఆయన టి.ఆర్.ఎస్ పార్టీని కాదని బి.ఎస్.పికి మద్దతిస్తారా ? అనేది ప్రతి తెలంగాణ వ్యక్తిలో మెదులుతున్న ప్రశ్న. ఒకవేళ అలా చేస్తే, ఈ వారమే మొదలుకానున్న బి.ఎస్.పి ప్రచారంలో ఆయన పాల్గొంటారా ? ఈ ప్రశ్నలకు రాబోయే కాలం ఎటువంటి సమాధానాలను ఇస్తుందో వేచి చూడాల్సిందే !