జనసైనికులకు పవన్ కవాతు పాఠాలు

Monday, 29th Oct 2018
జనసైనికులకు పవన్ కవాతు పాఠాలు

పరిపూర్ణమైన నాయకుడనేవాడు నిరంతరం అభ్యసిస్తూనే ఉంటాడు. తనను తాను పరీక్షించుకుని, తన జ్ఞానానికి పదును పెట్టుకుంటూ ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో గత విజయాలను తలచుకుని అహం పెంచుకుంటే తిరోగమించడం ఖాయం, అదే ఆదర్శంగా తీసుకుని ఒదిగి ఉంటే తాను పురోగమించడంతో పాటు ప్రజలను కూడా సంక్షేమం వైపు నడిపించగలడు. ఈ విషయాలన్నీ బాగా తెలిసినవారు కనుకనే పవన్ కళ్యాణ్ జనసైనికుడయ్యారు.

అభిమానులను, కార్యకర్తలను సమన్వయపరుచుకుంటూ విజయం దిశగా నడిపించడమనేది పరిపూర్ణమైన నాయకుడికి ఉండవలసిన ప్రథమ లక్షణం. ఆ అనుభవం సాధించారు కాబట్టే, కవాతు ద్వారా లభించిన ప్రాచుర్యాన్ని నెత్తికి ఎక్కించుకుని విజయంపై అతి ధీమాగా ఉండరాదని కార్యకర్తలకు సూచించారు పవన్. ఈ నెల 15న ఆయన నిర్వహించిన కవాతు ఇటు జనసేన పార్టీలోనూ అటు ప్రత్యర్థుల అంతరంగంలోనూ రాబోవు ఎన్నికలలో జనసేన విజయాన్ని ఖాయం చేసిందనే చెప్పొచ్చు.

ఈ తరుణంలో తన నుంచి కాని, తన అభిమానుల నుండి కాని ఏవిధమైన పొరపాటు జరిగినా అది రాబోవు ప్రజా సంక్షేమాన్ని అడ్డుకుంటుందని పవన్ భావిస్తున్నారు. ఇటీవలి కవాతుపై ఆంధ్రప్రభలో వచ్చిన ఒక విశ్లేషణను ఉదాహరణగా చూపిస్తూ ఇదే విషయాన్ని పవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కార్యకర్తలకు సూచించారు. ప్రజలు కొత్త రాజకీయాలను కోరుకుంటున్నట్లు కవాతు విజయం తెలుపుతోందని, ఈ సమయంలో కార్యకర్తలు మరింత బాధ్యతతో వ్యవహరించవలసి ఉంటుందని జననేత వివరించారు.

అంతేకాకుండా మార్పును తీసుకురావడానికి వచ్చిన పార్టీగా జనసేన పట్ల ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడింది. వారి ఆశలను మరియు ఆశయాలను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఇప్పుడు తమపై ఉందని పవన్ కార్యకర్తలకు తెలిపారు. అన్నిటికీ సిద్దపడే రాజకీయాలలోకి వచ్చానని తెలిపిన పవన్ ఇల్లు అలకగానే పండగ రాదని, భవిష్యత్తు కోసం అందరం కలిసి బాధ్యతాయుతంగా పని చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు విన్నవించారు.

పవన్ ఒక్క మాట చెబితేనే ప్రభుత్వం తారుమారైన వేళ ఆయన అందించిన ఈ సందేశం కార్యకర్తలుగా మారిన అభిమానులు అక్షరం తప్పకుండా పాటిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే జనబాట ద్వారా ఎంతో మంది సామాన్యులను తన మద్దతుదారులుగా మార్చుకున్న జనసేన, రాబోవు ఎన్నికలలో అత్యధిక మంది ఆదరణను చూరగొని లాంఛనంగా విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందని ఆకాంక్షిద్దాం.