ధైర్యమే పవన్ మొదటి లక్షణం

Saturday, 3rd Nov 2018
ధైర్యమే పవన్ మొదటి లక్షణం

ప్రతి రాజకీయవాది కూడా గొప్ప నాయకుడిగా రూపాంతరం చెందాలని భావిస్తుంటాడు కాని కొద్దిమంది మాత్రమే జన హృదయాలను గెలుచుకుని చరిత్రలో నిలిచిపోగలరు. అందుకు ప్రధాన కారణం సదరు వ్యక్తిలో ఉండే నాయకత్వ లక్షణాలే. ఏ దారిలో వెళితే అభివృద్ధి సాధ్యమవుతుందో నాయకుడికి తెలిసుండాలి, ఆ దారిలో తాను నడవగలనన్న నమ్మకముండాలి, అన్నిటికంటే ముఖ్యంగా తనను నమ్మినవారిని కూడా ఆ దారిలో నడిపించగలగాలి. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకునే ధైర్యం అతనిలో మెండుగా ఉండాలి.

అందుకే ధైర్యం నాయకుని యొక్క ప్రథమ లక్షణం అంటుంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ఈ లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నవాడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్. తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యంను కాంగ్రెస్ పార్టీలో కలిపినపుడు బహిరంగంగా వ్యతిరేకించిన తీరు కాని, ఎన్నో ప్రతికూలాంశాల మధ్య సొంతంగా జనసేన పార్టీ పెట్టి అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏకిపారేసిన తీరు గాని అతనిలోని ధైర్య గుణాన్ని బహిర్గతం చేసాయి.

అలాగే రాజకీయాలలో రాణించాలంటే సరైన మిత్రులు ఉండాలంటారు రాజకీయ దురంధురులు. ఒక కొత్త పార్టీ పెట్టీ పెట్టగానే బిజెపి వంటి కేంద్ర ప్రభుత్వమే మిత్ర హస్తం అందిస్తే మరే పార్టీ అయినా అణగిమణగి ఉంటుంది. కాని ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి తిరస్కరించిన బిజెపిపై పవన్ తన విమర్శనాస్త్రాలను సంధించి ప్రజా సంక్షేమం కోసం అవసరమైతే మిత్రత్వాన్ని కూడా వదులుకోవడానికి సిద్దమే అని నిరూపించారు. ఇదే సమయంలో అధికార పక్షమైన టిడిపి, కిమ్మనకుండా బిజెపి ఇచ్చిన ప్యాకేజీని తీసుకుని అణగిమణగి ఉన్న విషయం ప్రజలకు విదితమే. ఒక అధికార పక్షం కూడా చేయని సాహసం పవన్ చేసారు, ఇది ఆయనలోని ధైర్యాన్ని చాటే మరో ఉదంతం.

ఇక ప్రతి పార్టీ కూడా ఒక మీడియా సంస్థను తన అధీనంలో ఉంచుకుని వాస్తవాలను అవాస్తవాలుగా చూపిస్తూ, ప్రజలను మభ్యపెట్టి ఓటు రాజకీయాలు చేస్తున్న సమయంలో వాటిని బహిష్కరించమని చెప్పడం మరో సహస ఘట్టం. రాజకీయంలో నిలబడాలంటే ప్రాచుర్యం తప్పనిసరి, అందుకు మీడియా అండదండలు ఉండడం అనివార్యం. ఇటువంటి తరుణంలో వాటిని వ్యతిరేకించి సరైన పేరు కూడా లేని ఒక చిన్న మీడియా సంస్థ ద్వారా తన కార్యకలాపాలను కొనసాగించి విజయం కూడా సాధించడం ఆయనలోని దృఢచిత్తాని తెలుపుతోంది.

స్వర్గీయ నందమూరి తారకరామారావుతో సహా చరిత్రలో నిలిచిపోయిన ఏ నాయకుడిని తీసుకున్నా ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అని పోరాడి నిలిచినవాడే గొప్ప నాయకుడిగా కీర్తింపబడ్డారు. ప్రస్తుతం ఉన్న నాయకులలో ఈ లక్షణం ఉన్న నాయకుడు జనసేనుడే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే నిజాయితీ అతని కవచం, నమ్మకం అతని ఆయుధం, ధైర్యం అతని ప్రథమ లక్షణం.